Ind Vs Zim: భారత్ ఘన విజయం.. పోరాడి ఓడిన జింబాబ్వే

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు వెళ్లాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.
సూపర్ 8లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో జింబాబ్వే భారీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
భారత్ ఇచ్చిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే జట్టు పరుగుల వేటలో వెనకబడింది. 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు పోరాడి ఓడింది. జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 97 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.
20 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న బెన్నెట్ 59 బంతుల్లో 164 స్ట్రైక్ రేటుతో 97 పరుగులు సాధించాడు.
భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
అక్షర్ పటేల్ వేసిన 7వ ఓవర్ రెండో బంతికి ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి మారుమని ఔటయ్యాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 10వ ఓవర్ మూడో బంతికి తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి డియోన్ మేయర్స్ పెవిలియన్ బాట పట్టాడు.
మారుమని 20 బంతుల్లో 20 పరుగులు చేయగా, మేయర్స్ 6 పరుగులు మాత్రమే చేశాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా, బెన్నెట్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు.
31 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకుంటున్న సికందర్ రజాను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్‌కు పంపాడు.
17వ ఓవర్ రెండో బంతికి అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి రజా ఔటయ్యాడు. అదే ఓవర్ నాలుగో బంతికి ర్యాన్ బర్ల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన టోనీ మున్యోంగ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అర్ష్‌దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అనంతరం వచ్చిన టషింగ ముసికివా 7 పరుగులు చేసి శివమ్ దుబె బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మొత్తం 20 ఓవర్లలో జింబాబ్వే జట్టు ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే ముందు 257 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది.
దీనితో ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును కూడా భారత్ సృష్టించింది.
భారత్ బ్యాట్స్‌మెన్లలో అభిషేక్ శర్మ, హార్డిక్ పాండ్యా అర్థ శతకాలు సాధించారు.
హార్డిక్ పాండ్యా 50 (23 బంతుల్లో), తిలక్ వర్మ 44 (16 బంతుల్లో) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
అభిషేక్ శర్మ 54, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశారు.
అభిషేక్ శర్మ 26 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు, శర్మ నాలుగు మ్యాచుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.
చివర్లో వచ్చిన తిలక్ వర్మ హార్దిక్ పాండ్యాకు తోడు కావడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
భారత్ ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో భారత జట్టు సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే.
జింబాబ్వే జట్టులో రిచర్డ్, ముజర్బానీ, టినోటెండా, కెప్టెన్ సికందర్ రజాలు తలో వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఫోర్లు సిక్సులతో తొలి మూడు ఓవర్లలోనే స్కోరును 45 పరుగులు దాటించారు.
అయితే 3.4 ఓవర్ల వద్ద భారత్ తొలి వికెట్ పడింది. సంజు శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 48 పరుగులు.
ముజర్బానీ బౌలింగ్ లో బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి శాంసన్ పెవిలియన్ దారిపట్టాడు.
మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేసి ఔటయ్యాడు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్ కోసం భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది. జింబాబ్వే తమ జట్టులో ఒక మార్పు చేసింది. భారత జట్టులో అక్షర్ పటేల్, సంజు శాంసన్ తిరిగి చేరారు.
ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ 11 నుంచి వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్‌లను తప్పించారు.
సెమీఫైనల్స్ రేసులో భారత్ నిలవాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం.
సెమీఫైనల్‌కు చేరుకోవడానికి వెస్టిండీస్‌ను కూడా ఓడించాల్సి ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














