ఎప్‌స్టీన్ ఫైల్స్: ‘‘ఆ రోజు హాట్‌ టబ్‌లో మీ పక్కన ఉన్నది ఎవరు?’’ క్లింటన్‌ను ప్రశ్నించిన హౌస్ ఓవర్‌సైట్ కమిటీ, విచారణలో హిల్లరీ ఆగ్రహానికి కారణమేంటి?

క్లింటన్ ఫోటో

ఫొటో సోర్స్, US Department of Justice

    • రచయిత, బ్రజేష్ ఉపాధ్యాయ్
  • చదివే సమయం: 7 నిమిషాలు

లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ గురించి అమెరికన్ చట్టసభ సభ్యులు హిల్లరీ క్లింటన్‌ను అంతరంగికంగా ప్రశ్నించినప్పుడు ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయిన వీడియో బయటకొచ్చింది.

కమిటీ ఆమెను రహస్య గదిలో ప్రశ్నిస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఫోటో ఒకటి బహిర్గతం కావడంపై హిల్లరీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, కమిటీపై హిల్లరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఇక చాలు. మీరిలా చేస్తే, నేను చేసేదేమీ లేదు. నేనిలా చేసినందుకు మీరు నన్ను ఎంత సేపైనా కూర్చోబెట్టవచ్చు" అని ఆమె కోపంగా లేచి వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తోంది.

హౌస్ ఓవర్‌సైట్ కమిటీ సోమవారం ఈ వీడియో ఫుటేజ్ విడుదల చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ దంపతులు కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

బిల్ క్లింటన్‌ గతవారం ప్రత్యేకంగా కమిటీ ఎదుట ఒక్కరే హాజరై సాక్ష్యం చెప్పారు. ఎప్‌స్టీన్ నేరాల గురించి తనకు అంతకు ముందు తెలియదని అన్నారు.

ఎప్‌స్టీన్ బాధితులతో బిల్ క్లింటన్ తప్పుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు లేనప్పటికీ, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో క్లింటన్ ఫోటోలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆయనను కూడా ప్రశ్నిస్తున్నారు.

బిల్ క్లింటన్‌ను హౌస్ కమిటీ విచారిస్తూ ఉండటంతో ఆయనతో పాటు హిల్లరీని కూడా ప్రశ్నించాలని డిమాండ్లు వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆగ్రహంతో వెళ్లిపోయిన హిల్లరీ క్లింటన్

9 గంటల నిడివి ఉన్న వీడియో వాంగ్మూలంలో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి.

విచారణ సమయంలో హిల్లరీ క్లింటన్ సమాధానమిస్తూ ఆగ్రహంతో వెళ్లిపోయారు.

హిల్లరీ క్లింటన్ వాంగ్మూలం ఇస్తున్న సమయంలో ఆమె న్యాయవాదుల్లో ఒకరు, రహస్య గదిలో జరుగుతున్న విచారణకు సంబంధించిన ఫోటో ఒకటి ఎలా లీకైందని ప్రశ్నించారు.

తానే ఆ ఫోటోను షేర్ చేసినట్లు రిపబ్లికన్ ఎంపీ లారెన్ బోబెర్ట్ అంగీకరించారు. అయితే అది విచారణ ప్రారంభించక ముందు తీసిన ఫోటో అని చెప్పారు. ఆమె తీసిన ఫోటోను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒకరు ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.

ఫోటో లీకవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిల్లరీ తన పిడికిలితో టేబుల్‌పై గుద్దుతూ "సమస్య అది కాదు. మనమంతా ఒకే రకమైన నియమాలకు కట్టుబడి ఉన్నాం" అని అన్నారు.

హిల్లరీ క్లింటన్ ఈ విచారణ బహిరంగంగా జరగాలని కోరారని, అయితే కమిటీ ఆమె విజ్ఞప్తి తిరస్కరించిందన్న విషయాన్ని హిల్లరీ లాయర్ గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎంపీలను నిలదీశారు.

"ఇంక చాలు" అంటూ హిల్లరీ క్లింటన్ కుర్చీలో నుంచి లేచి నిల్చున్నారు.

దీంతో విచారణ కాసేపు ఆగిపోయింది. ఫోటో లీకవడంపై కమిటీ బాధ్యత వహించాలని విచారణ తిరిగి ప్రారంభమైన తర్వాత హిల్లరీ న్యాయవాదులు డిమాండ్ చేశారు.

"ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది అన్యాయం. ఈ విచారణ నిబంధనల ప్రకారం జరగాలని అనుకుంటున్నాం. అలాగే జరగాలని ఆశిస్తున్నాం" అని చెప్పారు.

బిల్, హిల్లరీ క్లింటన్

ఫొటో సోర్స్, Getty Images

యూఎఫ్ఓ, పిజ్జా గేట్ గురించి హిల్లరీకి ప్రశ్నలు

విచారణ ప్రారంభమైన చాలా సేపటి తర్వాత రిపబ్లికన్ ఎంపీ లారెన్ బోబెర్ట్ పిజ్జా గేట్‌ గురించి ప్రశ్నించారు. డెమొక్రాట్లు తిరస్కరించిన కుట్ర సిద్ధాంతం ఇది.

హిల్లరీ క్లింటన్ సహచరుల్లో కొందరు పిల్లల్ని అపహరించి వారిపై లైంగిక దాడులు చేశారని, ఇదంతా వాషింగ్టన్ డీసీలోని ఒక పిజ్జా సెంటర్‌లో జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

రిపబ్లికన్ ఎంపీ అడిగిన ప్రశ్నపై హిల్లరీ న్యాయవాదికి, బోబెర్ట్‌కు మధ్య కొంత చర్చ జరిగింది. ఎంపీ దేని గురించి ప్రశ్నిస్తున్నారో స్పష్టం చేయాలని హిల్లరీ లాయర్ కోరారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి హిల్లరీ రివ్యూ చేసినప్పుడు అందులో పిజ్జాగేట్ ప్రస్తావన ఉందా అని తాను ప్రశ్నించినట్లు బోబెర్ట్ స్పష్టత ఇచ్చారు.

"పిజ్జాగేట్ పూర్తిగా కల్పితం. ఇది చాలామందిని బాధపెట్టిన దారుణమైన ఆరోపణ. మీరు దానిని ప్రస్తావించడాన్ని నేను నమ్మలేకపోతున్నాను" అని హిల్లరీ అన్నారు.

పిజ్జా గేట్ గురించి బోబెర్ట్ అడిగిన మరికొన్ని ప్రశ్నలకు హిల్లరీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరో రిపబ్లికన్ ఎంపీ ఎరిక్ బర్లిసన్, తాను మనసు తేలిక పడే ప్రశ్నలతో మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రహాంతర వాసుల గురించిన ఫైళ్లను బయటపెట్టేందుకు చేసిన ప్రయత్నాలను వ్యాపారవేత్త లారెన్స్ రాక్‌ఫెల్లర్ అడ్డుకున్నారని బర్లిసన్ అన్నారు.

క్లింటన్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడినప్పుడు, తాము తిరిగి ఎన్నికైతే ఆ ఫైళ్లను బహిర్గతం చేస్తామని క్లింటన్ సలహాదారు బహిరంగంగా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇప్పుడు ఆ ఫైల్స్ బహిర్గతం చేయడం మీకు ఇష్టమేనా అని హిల్లరీని బర్లిసన్ అడిగారు. గ్రహాంతర వాసులకు సంబంధించిన ఫైల్స్ బహిర్గతం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ట్రంప్ గత నెలలో సూచించారు.

తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని హిల్లరీ అన్నారు. "బహిర్గతం చేయదగినవి ఏవైనా బహిర్గతం చేయవచ్చు" అని చెప్పారు.

బిల్ క్లింటన్

ఫొటో సోర్స్, The House Committee on Oversight and Government Reform

బిల్ క్లింటన్, ట్రంప్‌లు ఎప్‌స్టీన్ గురించి ఎప్పుడు చర్చించారు

బిల్ క్లింటన్‌ను గంటల పాటు విచారిస్తూ.. సాక్ష్యం తీసుకునే మధ్యలో.. డోనల్డ్ ట్రంప్‌ను సాక్ష్యం చెప్పమని బలవంత చేయాలా? అని బిల్ క్లింటన్‌ను అడిగారు.

''అది మీరే నిర్ణయించుకోవాలి'' అని అన్నారు. ''కానీ, ఆయనకు బాగా తెలుసు'' అని తెలిపారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్ గురించి 2002, 2003 సమయంలో ట్రంప్‌తో జరిగిన సంభాషణను క్లింటన్ గుర్తు చేసుకున్నారు.

''ఆయన అనుచితమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఒకసారి కూడా నాకనిపించేలా ట్రంప్ నాకేమీ చెప్పలేదు. 'మేం స్నేహితులంగా ఉండేవాళ్లం, ఒక ల్యాండ్ డీల్ విషయంలో కలుసుకున్నాం..అని చెప్పారు అంతే'' అని తెలిపారు.

ఈ సంభాషణ నిధుల సేకరణ సమయంలో ట్రంప్ గోల్ఫ్ కోర్సు వద్ద జరిగిందని క్లింటన్ చెప్పారు.

ట్రంప్ తనతో ఏం చెప్పారో క్లింటన్ వివరించారు. ''మామధ్య కొన్నేళ్లు మంచి బంధం కొనసాగింది. కానీ, అదంతా ముగిసిపోయింది. ఒక రియల్ ఎస్టేట్ డీల్ వల్లనే అదంతా..'' అని ట్రంప్ చెప్పినట్లు క్లింటన్ తెలిపారు.

ఎప్‌స్టీన్ అంశాన్ని ఎవరు తొలుత ప్రస్తావించారో గుర్తు తెచ్చుకోవాలని క్లింటన్‌ను అడిగారు.

''గుర్తు లేదు, ఒకవేళ గుర్తుంటే నేను షాకవుతాను. నేను సాధారణంగా అలాంటివి పట్టించుకోను'' అని సమాధానమిచ్చారు.

ఎప్‌స్టీన్‌తో ఆయన కలిసిన సందర్భాలపై ట్రంప్ ఏమైనా చెప్పారా అని అడిగినప్పుడు.. వారి సంభాషణలో ట్రంప్ ఎలాంటి లైంగిక వ్యవహారాల గురించి ప్రస్తావించలేదని తెలిపారు.

బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్

ఫొటో సోర్స్, The House Committee on Oversight and Government Reform

హాట్ టబ్ ఫోటో గురించి అడిగినప్పుడు మాజీ అధ్యక్షుడు ఎలా స్పందించారంటే..

బిల్ క్లింటన్ నుంచి సాక్ష్యాన్ని తీసుకునేటప్పుడు, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో భాగంగా యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఫోటో గురించి బిల్ క్లింటన్‌ను ప్రశ్నించారు.

ఎవరితోనో అమెరికా మాజీ అధ్యక్షుడు హాట్ టబ్‌లో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆ ఫోటోలో ఉంది. మరో వ్యక్తి ముఖం కనిపించలేదు.

ఈ ఇమేజ్ ఎప్పుడు ఎక్కడ తీశారో, దానికి సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియాల్సి ఉందని ఒక కాంగ్రెస్‌ సభ్యుడు అన్నారు.

''ఈ ఫోటో తీసినట్లు నాకు తెలియదు'' అని క్లింటన్ తెలిపారు. సుదీర్ఘమైన ఆసియా పర్యటన చివరిలో బ్రూనైలో దీన్ని తీశారని ఆయన దాదాపు కచ్చితంగా చెప్పగలిగారు.

''అధ్యక్షుడిగా ఉన్న నా ఎనిమిదేళ్ల కాలంలో బ్రూనై సుల్తాన్ నాకు బాగా తెలిసిన వ్యక్తి'' అని తెలిపారు.

క్లింటన్ గ్లోబల్ కార్యక్రమానికి ఆయన సాయం చేశారని వివరించారు. అలాగే, ఉండేందుకు ఒక హోటల్‌ను కూడా సూచించారని తెలిపారు.

''ఈ హోటల్‌లో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు ఈ పూల్‌ను వాడుకుంటారని ఆశిస్తున్నా అని ఆయన చెప్పారు. నేను అలానే చేశాను, ఆ తర్వాత బయటికి వచ్చి, అలసిపోవడంతో నా బెడ్‌పై విశ్రాంతి తీసుకున్నా'' అని క్లింటన్‌ను చెప్పారు.

జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఈ ఫోటోలో ఉన్న మరో వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు, ''వారెవరో నాకు తెలియదు'' అని క్లింటన్ రెండుసార్లు గట్టిగా సమాధానమిచ్చారు.

''నేను ఐదు నిమిషాల పాటు లేదా కొంచెం సేపు పాటు హాట్ టబ్‌లో కూర్చున్నా. ఆ తర్వాత లేచి, బయటికి వచ్చి నిద్రపోయాను'' అని తెలిపారు.

ఆ రాత్రి ఏదైనా లైంగిక చర్య జరిగిందా? లేదా హాట్ టబ్‌లో ఆ వ్యక్తితో ఏదైనా జరిగిందా? అని అడిగినప్పుడు, లేదు అని తల అడ్డంగా ఊపారు.

అదే హోటల్‌కు సంబంధించిన మరికొన్ని ఫోటోలను కూడా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది.

బిల్ క్లింటన్

ఫొటో సోర్స్, GOP Oversight/Handout

ఎప్‌స్టీన్ నేరాలకు నేను సాక్ష్యం కాను: బిల్ క్లింటన్

హౌస్ ఓవర్‌సైట్ కమిటీకి తెలిపిన తన ప్రారంభ వ్యాఖ్యల్లోనే.. ఎప్‌స్టీన్ తప్పుడు చర్యలకు పాల్పడే విషయం తనకు తెలియదని ఖండిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది.

ఎప్‌స్టీన్ దర్యాప్తులో ఆయన జోక్యానికి సంబంధించిన విచారణ మరోసారి ఇలాంటిది జరగకుండా అడ్డుకుంటుందని ఆశిస్తున్నట్లు బిల్ క్లింటన్ అన్నారు.

ఎప్‌స్టీన్‌తో తనకు తక్కువ పరిచయం మాత్రమే ఉందని, ఆయన నేరాలు బయటికి రావడానికంటే చాలాఏళ్ల ముందే తమ బంధం ముగిసిపోయిందని స్పష్టం చేశారు.

ఎప్‌స్టీన్‌తో క్లింటన్‌కు ఉన్న సంబంధాలపై పలు ఆరోపణలు వచ్చాయి. కానీ, తమ సంబంధం కేవలం చారిటీ పనులకేనని మాజీ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

ఎప్‌స్టీన్, గిస్లేన్ మ్యాక్స్‌వెల్

ఫొటో సోర్స్, US Justice Department/Handout

మ్యాక్స్‌వెల్‌‌ గురించి ప్రశ్నలు

ఆయనను విచారించిన సమయంలో, ఎప్‌స్టీన్ బాధితులను సెక్స్ ట్రాఫికింగ్ చేసినందుకు 20 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటోన్న ఘిస్లెయిన్ మ్యాక్స్‌వెల్‌‌కు ట్రంప్ క్షమాభిక్ష పెట్టాలా? లేదా శిక్షను తగ్గించాలా అని బిల్ క్లింటన్‌ను అడిగారు.

''దీనిపై నేను కామెంట్ చేయాలనుకోవడం లేదు'' అని బిల్ క్లింటన్ అన్నారు.

''ఇది బయటికి వచ్చినప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది'' అని మ్యాక్స్‌వెల్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. మ్యాక్స్‌వెల్‌తో స్నేహపూర్వకంగా ఉన్నట్లు తెలిపారు.

''నాకు చాలా బాధగా అనిపించింది. కానీ, ఆమె చేసినపని దారుణం. ఆమెను శిక్షించాలి'' అని బిల్ క్లింటన్ అన్నారు.

ఎప్‌స్టీన్, మ్యాక్స్‌వెల్ నేరాలకు సంబంధించి చేపడుతోన్న విచారణలో యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన డాక్యుమెంట్లలో క్లింటన్‌కు, ఎప్‌స్టీన్‌కు మధ్య నేరుగా ఏదైనా మెసేజ్‌లు జరిగినట్లు చూపించలేదు. కానీ, క్లింటన్ ముఖ్యసలహాదారు డౌగ్ బ్యాండ్, మ్యాక్స్‌వెల్ మధ్య జరిగిన చాట్‌లలో వీరిద్దరి గురించి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)