Ind vs Eng: సెమీస్‌లో భారత్ గెలుపు అంత ఈజీ కాదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు ఎందుకు అంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాథ్యూ హెన్రీ
- హోదా, బీబీసీ స్పోర్ట్స్ జర్నలిస్ట్
- చదివే సమయం: 3 నిమిషాలు
ఇండియా, ఇంగ్లండ్ మధ్య గురువారం ముంబైలో జరిగే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో హారిబ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లిషు జట్టు విజయం సాధిస్తుందనే ఫీల్ కలుగుతోందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డారు.
బీబీసీ రేడియో 5 కోసం ఇచ్చిన టెస్ట్ మ్యాచ్ స్పెషల్ పాడ్‌కాస్ట్‌లో మైఖేల్ వాన్ మాట్లాడారు.
ఇండియా కంటే ఇంగ్లండ్‌కే స్పిన్ బలం ఎక్కువని వాన్ అన్నారు.
ఈ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇండియా సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది.
గ్రూపు దశలో కూడా తడబడింది.


ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్ కూడా ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో సత్తా చాటకపోయినా వరుసగా ఐదు విజయాలతో టాప్ 4లోకి చేరింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లలో ఇంగ్లండ్ విజయం సాధించింది.
''వాళ్లు గెలుపు సూత్రం ఏదో తెలుసుకున్నట్లు కనిపిస్తున్నారు'' అని పాడ్‌కాస్ట్‌లో మైఖేల్ వాన్ చెప్పారు.
‘‘న్యూజీలాండ్ గెలుపు వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయినా, విజయతీరాన్ని దాటడం గొప్ప ప్రయత్నం'' అన్నారు
ఈ టోర్నీలో ఇంగ్లండ్ బ్యాటింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. పాకిస్తాన్‌పై కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత శతకం సాధించినా, ఇతర మ్యాచ్‌లలో గెలిపించేంతటి ప్రదర్శనలు తక్కువగానే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్ బౌలింగ్ బలం బావుందంటారు వాన్. అదీల్ రషీద్, డాసన్, విల్ జాక్స్ స్పిన్ దాడితోపాటు జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్, జేమీ ఓవర్టాన్ ఫాస్ట్ బౌలింగ్ జట్టుకు బలంగా అభివర్ణించారు.
''భారత్ కంటే ఇంగ్లండ్‌కే బలమైన స్పిన్ దాడిచేసే సత్తా ఉంది'' అన్నారు.
"వరుణ్ చక్రవర్తి ప్రభావం చూపుతున్నాడు. అయితే స్పిన్ రీత్యా చూసినప్పుడు డాసన్, రషీద్, విల్ జాక్స్ ఈ టోర్నమెంట్‌లో ఉత్తమ స్పిన్ త్రయం" అన్నారు వాన్.
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్. కానీ, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లలో వరుసగా 40, 47 పరుగులు సమర్పించుకున్నాడు. భారత్‌కు కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఇతనికి ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్లలో మంచి రికార్డు ఉన్నప్పటికీ, ఈ టోర్నమెంట్‌లో అతను కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.
"ఇంగ్లండ్ ఫీల్డింగ్ అసాధారణంగా ఉంది" అంటారు వాన్.
"వారు చాలా చురుకుగా కనిపిస్తున్నారు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీసుకున్నారు'' అని చెప్పారు.
''ముంబయిలో వారు గెలుస్తారని ఓ విచిత్రమైన ఫీల్ కలుగుతోంది’’ అన్నారు.

ఈ టోర్నీలో వరుసగా ఐదుసార్లు సాంతం పది పరుగులు కూడా చేయకుండానే వెనుదిరిగి, ఫామ్ లేమితో తంటాలు పడుతున్న ఓపెనర్ జోస్ బట్లర్‌పై ఇంగ్లండ్ నమ్మకం ఉంచే అవకాశం ఉందని చెప్పారు. బట్లర్ ఎక్కువగా తన టెక్నిక్‌పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని చెప్పారు వాన్.
''మీరు అనుకున్నట్టుగా ఆడటం లేదని తెలిసినప్పుడు మీ టెక్నిక్‌ను సరిచేసుకుంటారు'' అని వాన్ తెలిపారు.
గురువారం ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఆతిథ్య జట్టుకు ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు ఉంటుంది.
టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇది మూడో సెమీ ఫైనల్. 2022లో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. 2024లో గయానాలో భారత్ విజయం సాధించింది. ఆ తరువాత రెండు జట్లు కూడా టైటిల్ గెలుచుకున్నాయి.
ఆల్‌రౌండర్ కరన్, గత రెండు సెమీ ఫైనళ్లలో ఆడిన ఆటగాడు, 2022 విజయం ఇంగ్లండ్‌కు ఆదర్శమని వాన్ చెప్పారు.
"పర్ఫెక్ట్ గేమ్ కోసం చూస్తే, దాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు" అని ఆయన బీబీసీ స్పోర్ట్స్‌కు తెలిపారు.
''భారత్‌లో మేం చాలా క్రికెట్ ఆడాం. భారత్ మంచి జట్టు. ఒత్తిడి అన్నివైపులా ఉంటుంది'' అన్నారు వాన్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














