హైదరాబాద్: వజ్రాలు ఉంటాయని సింహాల బోనులోకి దూకబోయాడు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
సింహం దగ్గర వజ్రాలు ఉంటాయంటూ ఒక యువకుడు హైదరాబాద్ జూలోని సింహాల బోనులోకి దూకబోయాడని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
సందర్శకులతో కిటకిటలాడుతున్న జూపార్క్‌లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
లయన్ మోట్ (రక్షణగోడ)పై నిలబడిన ఓ వ్యక్తి అందులోకి దూకేందుకు ప్రయత్నించగా గమనించిన సందర్శకులు జూ అధికారులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు వ్యక్తిని అదుపులోకి తీసుకొని పెద్ద ప్రమాదం నుంచి తప్పించారు.
జూపార్క్, బహదూర్‌పుర పోలీసుల వివరాల ప్రకారం, కీసరకు చెందిన సాయికుమార్ (31) స్థానికంగా ఉన్న హోటళ్లలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
మంగళవారం జూపార్కు సందర్శన కోసం వచ్చిన సాయికుమార్ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆఫ్రికన్ సింహాలు (రాధ,కృష్ణ) ఉన్న మోట్ వద్దకు చేరుకున్నాడు.
అనంతరం సింహాల వద్ద వజ్రాలు, రత్నాలు ఉంటాయని అరుస్తూ ఎన్‌క్లోజర్‌లోకి దూకబోయాడు.
అప్పటికే సందర్శకుల కోసం సింహాలను అధికారులు మోట్‌లోకి వదలడంతో పర్యటకులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమై అతడి ప్రయత్నాలను నిలువరించారు. అనంతరం జూ పార్కు అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని బహదూర్‌పుర పోలీసులకు అప్పగించారు.
సాయికుమార్ కొంత మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్లు గుర్తించామని బహదూర్ పుర ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపినట్లు పత్రిక వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
సంక్రాంతి రైళ్లు అప్పుడే ఫుల్
సంక్రాంతి పండక్కి నెలన్నర ముందే తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్లలో రిజర్వేషన్లు పూర్తైనట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
చాలా బండ్లలో చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. గోదావరి, గౌతమి, గరీబ్ రథ్ వంటి రైళ్లలో నిరీక్షణ జాబితా వందల్లో ఉంది. ఫలక్‌నుమా, ఎల్‌టీటీ, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లలో పరిమితి దాటి 'రిగ్రెట్'కు చేరింది.
ఈసారి సంక్రాంతికి స్వస్థలాలకు బయల్దేరేవారు, జనవరి 9 ఆదివారం కావడంతో అంతకు ముందురోజు నుంచి ప్రయాణాలు పెట్టుకుంటున్నారు.
అప్పుడు మొదలుకొని 10-12 వరకు టికెట్లకు భారీగా డిమాండ్ ఉంది. 13వ తేదీ కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఉంది.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, నరసాపురం వైపు రద్దీ తీవ్రంగా ఉంది. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రికి వెళ్లాలనుకునే వారికీ టికెట్లు దొరకట్లేదు.
ఒడిశా, బెంగాల్‌కు వెళ్లే రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉంది. పుణె, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాల్లో ఉన్నవాళ్లు తెలుగు రాష్ట్రాల్లోని సొంతూళ్లకు ప్రయాణాలు పెట్టుకోవడంతో అటు నుంచి వచ్చే రైళ్లలోనూ రద్దీ ఉంది.
గత సంక్రాంతి సమయంలో సెకండ్‌వేవ్ భయం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
చాలామంది వాక్సిన్ వేయించుకుని ఉండడంతో పెద్దసంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారని పత్రిక రాసింది.
ఈ ప్రభావం సంక్రాంతి రైళ్ల రిజర్వేషన్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇన్నాళ్లు అదనపు ఛార్జీలతో నడిపిన ప్రత్యేక రైళ్లను కొవిడ్‌కు ముందు మాదిరిగానే సాధారణ ఛార్జీలతో నడుపుతుండటం రైలు టికెట్లకు డిమాండ్‌ను పెంచుతోందని పత్రిక వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో థర్డ్ వేవ్ లేనట్లే
భారత్‌లో థర్డ్ వేవ్ ముప్పు తొలగినట్లు వైద్య నిపుణులు భావిస్తున్నారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
దీపావళి ముగిసి 3 వారాలైనా కేసులు తక్కువగానే ఉండడాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నారు.
ఇప్పటికే రెండో వేవ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడడం, కొన్ని నెలలుగా టీకా పంపిణీ వేగిరం కావడాన్ని ప్రస్తావిస్తూ మరో వేవ్ వచ్చినా ముప్పు తక్కువే అంటున్నారు.
శీతాకాలానికి తోడు కొత్త, వ్యాప్తి రేటు అధికంగా ఉండే వేరియంట్ ఉద్భవిస్తే డిసెంబరు చివరి నుంచి ఫిబ్రవరి వరకు కేసులు కొంత పెరగొచ్చని, కానీ సెకండ్ వేవ్ అంతటి తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు సోనేపట్‌లోని అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గౌతమ్‌మీనన్.
అయితే, జాగ్రత్తలు పాటించడం మాత్రం తప్పనిసరి అంటున్నారు. టీకా పొంది ఉన్నందున చాలామందికి ఇప్పటికే రక్షణ లభించిందని చెప్పారు.
నేరుగా టీకా తీసుకున్నవారితో పోలిస్తే.. కరోనా బారినపడి కోలుకుని టీకా పొందినవారికి రక్షణ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇలాంటివారిలో కలిగిన రోగ నిరోధక శక్తిని.. ''హైబ్రిడ్ ఇమ్యూనిటీ''గా పేర్కొంటున్నారు. మరోవైపు 46 రోజులుగా దేశంలో కేసులు 20 వేలలోపునే ఉంటున్నాయి. మంగళవారం 7,579 కేసులే వచ్చాయని పత్రిక వివరించింది.

ఫొటో సోర్స్, AFP
చమురు ధరలకు భారత్ చెక్
కొద్ది నెలలుగా మండుతున్న ముడిచమురు ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోందని సాక్షి దిన పత్రిక వార్త ప్రచురించింది.
దీనికి వీలుగా అత్యవసర వినియోగానికి పక్కనపెట్టిన చమురు నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారళ్లను విడుదల చేయనున్నట్లు భారత్ తాజాగా వెల్లడించింది. తద్వారా యూఎస్, చైనా, జపాన్ బాటలో నడవనుంది.
దేశ చరిత్రలోనే తొలిసారి కేంద్ర ప్రభుత్వం 3.8 కోట్ల బ్యారళ్ల(5.33 మిలియన్ టన్నులు) ముడిచమురును నిల్వ చేసింది.
ఇందుకు తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో ఏర్పాటు చేసిన భూగర్భ బిలాలను వినియోగించుకుంది. వీటి నుంచి తాజాగా నిర్ణయించిన 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ ఇంధన ధరలు తగ్గేందుకు వీలుగా నిల్వల నుంచి చమురును విడుదల చేయవలసిందిగా గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో గత వారం యూఎస్ ప్రభుత్వం అభ్యర్థించింది.
ఇందుకు ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే చైనా, ఇండియా, జపాన్ తదితర దేశాలు కలసికట్టుగా వ్యవహరించాలంటూ సూచించింది.
చమురు ఉత్పత్తిని పెంచమంటూ పలుమార్లు చేసిన అభ్యర్థనలను పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్), తదితర దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో యూఎస్ వినియోగ దేశాలకు చమురు విడుదలకు సూచించింది.
ఇందుకు మార్గదర్శకత్వాన్ని వహిస్తూ 50 మిలియన్ బ్యారళ్లను విడుదల చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.
ఈ బాటలో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వుల నుంచి 5 మిలియన్ బ్యారళ్ల విడుదలకు భారత్ సైతం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయని సాక్షి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- ఘాతక్ డ్రోన్ : పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పును ఇది తప్పిస్తుందా
- ‘‘మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ఓ పెద్ద ఎత్తుగడ.. ఇదీ తెరవెనుక కథ’’
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
- ‘ఆన్లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టాం... ఏమీ అర్థం కాలేదని చెబితే ఏమంటారో’
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








