వాట్సాప్ గ్రూప్ పెట్టి మరీ లంచాలు వసూలు చేస్తున్న అధికారి ఏసీబీకి చిక్కాడు: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్న ఒక వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులకు చిక్కినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.
తనిఖీలు చేయకుండా ఉండాలంటే తనకు లంచం ఇవ్వాలంటూ ఎరువులు, పురుగుమందుల దుకాణదారులతో బేరసారాలకు దిగిన మండల వ్యవసాయాధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఏసీబీ డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి ఆ వివరాలు వెల్లడించారు. ఏ నెలలో ఎవరు? ఎంతెంత? లంచాలు ఇవ్వాలో సమాచారం ఇచ్చేందుకు సదరు అధికారి ఏకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేసినట్టు తెలుసుకున్న ఏసీబీ అధికారులు నోరెళ్లబెట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేష్‌చందర్ ఛటర్జీ ఎనిమిదేళ్లుగా మండల వ్యవసాయాధికారి(ఏవో)గా పనిచేస్తున్నారు.
తనిఖీలు చేయకుండా ఉండేందుకు నెలవారీగా ఇచ్చే లంచం సొమ్ము ఇవ్వాలంటూ మండలంలోని పురుగుమందులు, ఎరువుల యజమానులను డిమాండ్ చేశారు.
ఇందుకోసం ఏర్పాటు చేసిన వాట్సప్‌లో గ్రూపులో ఈ నెలలో దుకాణానికి రూ.15 వేలు ఇవ్వాలంటూ సందేశాలు పంపాడు.
ఈ విషయమై చంద్రుగొండలోని ఆరు దుకాణాల యజమానులు జులై 30న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
పథకం ప్రకారం..ఆరు దుకాణాల నుంచి నగదు సేకరించిన వారు ఆ సొమ్ము తీసుకోవడానికి రావాలంటూ ఏవోను కోరారు.
ఈ మేరకు చంద్రుగొండ రైతు వేదికలో సోమవారం సత్యం, సీతారాములు నుంచి ఏవో రూ.90 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అదే సమయంలో అశ్వారావుపేటలోని ఆయన స్వగృహంలో ఏసీబీ సీఐ రఘుబాబు సోదాలు చేశారు.
వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, చట్టప్రకారం అధికారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించినట్లు ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, YSRCongress
హత్య ఒప్పుకోమని చిత్రహింసలు-సునీల్ కుమార్ కుటుంబం
వైఎస్.వివేకానందరెడ్డిని హత్య చేశానని ఒప్పుకోమంటూ తమ కొడుకును హింసిస్తున్నారని సునీల్ యాదవ్ తల్లిదండ్రులు ఆరోపించినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
''వివేకానందరెడ్డిని మీరే హత్య చేశారు. ఒప్పుకోండి'' అంటూ సీబీఐ అధికారులు తమ కుమారుడు సునీల్ యాదవ్‌ను, తమను చిత్రహింసలు పెట్టారని ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్‌యాదవ్ తల్లిదండ్రులు సావిత్రమ్మ, కృష్ణయ్య యాదవ్‌లు చెప్పారు.
సోమవారం వారి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలలుగా సునీల్ యాదవ్‌ను, తమ కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
బట్టలు ఊడదీసి ఇష్టమొచ్చినట్లు చితకబాదారని కృష్ణయ్యయాదవ్ చెప్పారు. ''ఒప్పుకొంటే మీ కుటుంబం సేఫ్‌గా ఉంటుంది. లేదంటే ఇబ్బంది పడుతుంది'' అని సీబీఐ అధికారులు పదేపదే హెచ్చరించారన్నారు.
ఈ కేసుతో సునీల్‌కు కానీ, తమకు గాని ఎలాంటి సంబంధం లేదన్నారు. కావాలనే తమను ఇరికిస్తున్నారన్నారు.
సావిత్రమ్మ మాట్లాడుతూ.. తనను ఎన్నో ప్రశ్నలు అడిగారని అవి చెప్పుకోలేనివని అన్నారు. రెండున్నర సంవత్సరాలుగా నోరు తెరవని రంగయ్య ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడు?
మా అబ్బాయి సునీల్ తప్పు చేసేవాడు కాదు. ఈ కేసులో మా అబ్బాయిని ఇరికించేందుకే ప్రయత్నం సాగుతోంది అని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం సునీల్ యాదవ్ భార్య లక్ష్మి మాట్లాడుతూ... సీబీఐ అధికారులు ఉద్దేశపూర్వకంగా తన భర్తను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

మిస్డ్ కాల్ ఇస్తే గ్యాస్ కనెక్షన్
మిస్డ్ కాల్ ఇస్తే గ్యాస్ కనెక్షన్ అందిస్తామని ఇండేన్ గ్యాస్ ప్రకటించినట్లు సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఎల్‌పీజీ కనెక్షన్‌దారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శుభవార్త చెప్పింది.
కేవలం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఎల్పీజీ కొత్త కనెక్షన్ తీసుకోవడం, ఎల్పీజీ రీఫిల్ వంటి సదుపాయాలు పొందేలా సదుపాయం తీసుకొచ్చింది.
కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లు ఈ సదుపాయాన్ని 8454955555కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పొందొచ్చని ఐఓసీ చైర్మన్ ఎస్‌ఎం వైద్య సోమవారం వెల్లడించారు.
దీనితో పాటు ఒక సిలిండర్ కలిగిన వారు మరో సిలిండర్ పొందే సదుపాయాన్ని (డబుల్ బాటిల్ కనెక్షన్) ఇంటివద్దకే తీసుకొచ్చేందుకు కొత్త ప్రణాళిక రచించారు.
14.2 కేజీల సిలిండర్ ఉన్నవారు బ్యాక్‌అప్ కోసం మరో 5కేజీల సిలిండర్ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చని సూచించారని సాక్షి పత్రిక వివరించింది.

ఫొటో సోర్స్, CHIRANJEEVI/FB
'మా' ఎన్నికలు వెంటనే పెట్టండి - చిరంజీవి
మా ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సినీ నటుడు చిరంజీవి కృష్ణంరాజుకు లేఖ రాసినట్లు నమస్తే తెలంగాణ వార్తా పత్రిక కథనం ప్రచురించింది.
ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. రోజురోజుకూ అసోసియేషన్‌లో గొడవలు పెరుగుతుండటం, 'మా' ఎన్నికలు (MAA Elections ) లేట్ అవుతుండటంతో.. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
'మా' క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజుకు ఆయన లేఖ రాశారు. 'మా' ఎన్నికలు వెంటనే జరగాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి మార్చి నెలలో నిర్వహించే 'మా' కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ ఈసారి కరోనా వల్ల వాయిదా పడింది.
ప్రస్తుతం ఆపద్ధర్మ కార్యవర్గం కొనసాగుతున్నది. ఎన్నికలు నిర్వహించకుండా.. ఇలా ఆపద్ధర్మ కార్యవర్గాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు.
ప్రస్తుత కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఉండదు. కాబట్టి.. వీలైనంత త్వరగా మనం కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే జాప్యం లేకుండా 'మా' ఎన్నికలు వెంటనే జరగాలి.. అని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు.
తెలుగు సినీ రంగంలో గౌరవనీయ వ్యక్తిగా ఉన్న మీరు, డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా మీ మార్గదర్శకత్వంలో 'మా' ఎన్నికలు సజావుగా, వీలైనంత త్వరగా జరుగుతాయన్న నమ్మకం నాకుంది.
ఇటీవలే బార్ కౌన్సిల్ ఎన్నికలు, ఇంకా మరికొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల ఎన్నికలు కరోనా ప్రోటోకాల్‌ను పాటిస్తూ నిర్వహించారని తెలిసింది.
అందుకే… వీలైనంత త్వరగా 'మా' ఎన్నికలను కూడా జరిపించండి.. అంటూ చిరంజీవి.. కృష్ణంరాజుకు లేఖ రాశారని నమస్తే తెలంగాణ వివరించింది..
ఇవి కూడా చదవండి:
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో సిఐఏకు సాయపడ్డ డాక్టర్ షకీల్ అఫ్రిది... అమెరికాలో హీరో, పాకిస్తాన్లో ద్రోహి
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








