నటి రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ కేసు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/Spotlight.RaginiDwivedi
అక్రమ మాదకద్రవ్యాల కేసులో ప్రముఖ కన్నడ సినీ నటి రాగిణి ద్వివేదితోపాటు మరో ఇద్దరిని శుక్రవారం బెంగళూరు పోలీసులు అరెస్టు చేసినట్లు నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.
ఆమెతోపాటు రాహుల్, వీరేన్ ఖన్నా అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం ఉదయం రాగిణి నివాసంలో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసు బృందం సోదాలు జరిపి, ఆపై ఆమెను అరెస్టు చేసి సీసీబీ కార్యాలయానికి తరలించారు.
రాగిణికి అత్యంత సన్నిహితుడు, ఆర్టీవో కార్యాలయంలో క్లర్క్ రవిశంకర్ అలియాస్ రవి ఇప్పటికే అరెస్టయినట్లు ఈ కథనం వెల్లడించింది. డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, facebook
నూతన్ నాయుడు అరెస్ట్
విశాఖ జిల్లాలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో అనుమానితుడు, సినీ నిర్మాత, బిగ్‌బాస్ ఫేమ్ నూతన్‌నాయుడిని కర్ణాటక పోలీసులు ఉడిపి రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసినట్లు సాక్షి పత్రిక వెల్లడించింది.
శిరోముండనం కేసులో ఆయన ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా వెల్లడించినట్లు ఈ కథన పేర్కొంది.
మరోవైపు ఈ ఘటన జరిగిన తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరుతో నూతన్ నాయుడు కొందరు అధికారులతో మాట్లాడారని, ఈ కేసులో నిందితురాలు ప్రియామాధురి ( నూతన్ నాయుడి భార్య )కి రెండు వారాలపాటు వైద్యం అందించాల్సిన అవసరం ఉందంటూ నివేదిక ఇవ్వాల్సిందిగా విశాఖ కేజీహెచ్ డాక్టర్లను కోరారని పోలీసులు వెల్లడించారు.
అనుమానం వచ్చిన అధికారుల పీవీ రమేశ్‌కు ఫోన్ చేయడం, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆ నంబర్‌ను ట్రేస్ చేసి ముంబయి వెళుతున్న నూతన్ నాయుడుని ఉడుపిలో అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా నివేదికలు నమ్మశక్యంగా లేవు- తెలంగాణ హైకోర్టు
కరోనా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నమ్మడానికి వీల్లేకుండా ఉన్నాయని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ప్రభుత్వం నివేదికల్లో వాస్తవాలు చెప్పడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఈ కథనం వెల్లడించింది.
రోజుకు 9-10 చనిపోతున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని, ప్రభుత్వ లెక్కలకు, వాస్తవాలకు పొంతన కుదరడంలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరణాలపై ప్రభుత్వం జారీ చేస్తున్న బులిటెన్లకు, కలెక్టర్లు విడుదల చేస్తున్న బులిటెన్లకు మధ్య తేడాలున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇప్పటి వరకు 38 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఏయే ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారో మాత్రం చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. పేదలకు వైద్యం పేరుతో ప్రభుత్వం నుంచి రాయతీలు పొందిన ఆసుపత్రుల పేర్లను కూడా బైటపెట్టాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారో వివరిస్తూ ఈ నెల 22లోగా నివేదిక అందించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, ANI
తమిళనాడు బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు-ఏడుగురు దుర్మరణం
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ఓ బాణాసంచా తయారీ కేంద్రలో పేలుడు సంభవించి ఏడుగురు మహిళలు దుర్మరణం పాలైనట్లు ఈనాడు పేర్కొంది.
కాట్టుమన్నార్ కోవిల్ సమీపంలోని కురంగుడి గ్రామంలో ఓ మహిళ బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు.
దీపావళి కోసం టపాకాయాలు తయారు చేస్తుండగా పెద్ద శబ్ధంతో ఆ కర్మాగారం పేలిపోయింది. అక్కడ పని చేస్తున్న మహిళల్లో ఐదుగురి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కొందరి శరీరభాగాలు దూరంగా పొలంలో పడ్డాయి. మరో ఇద్దరు మహిళలు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఈనాడు కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








