శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో పేలుడు, 9 మంది మృతి.. డీజీపీ ఏం చెప్పారంటే..

ఫొటో సోర్స్, ANI
- రచయిత, మాజిద్ జహంగీర్
- హోదా, బీబీసీ ప్రతినిధి, శ్రీనగర్ నుంచి
- చదివే సమయం: 3 నిమిషాలు
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ శివారు ప్రాంతంలో ఉన్న నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి పేలుడు సంభవించింది.
ఈ పేలుడులో 9 మంది చనిపోయారని, 27 మంది పోలీసులతో సహా మొత్తం 32 మంది గాయపడ్డారని జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వెల్లడించారు.
'మరణించిన వారిలో ముగ్గురు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం సభ్యులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఇతర ఉద్యోగులు ఉన్నారు. గాయపడిన వారిలో 27 మంది పోలీసులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు ఉన్నారు' అని ఆయన తెలిపారు.
పోలీస్ స్టేషన్ లోపల కొంత అమ్మోనియం నైట్రేట్ (పేలుడు పదార్థం) నిల్వ ఉంచగా, అది పేలిపోయినట్లు సోర్సెస్ తెలిపాయి.
పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ లోపల ఉంచిన వాహనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయని, దాని శబ్దం కొన్ని కిలో మీటర్ల వరకు వినిపించినట్లు అక్కడివారు చెబుతున్నారు.

'వైట్ కాలర్' టెర్రర్ మాడ్యూల్ కేసుతో సంబంధం ఉన్న పేలుడు పదార్థాల నుంచి నమూనాలు తీసుకుంటుండగా ఈ పేలుడు సంభవించిందని వార్తా సంస్థ పీటీఐకి అధికారులు తెలిపారు. ఈ పేలుడు పదార్థాలను హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి తీసుకొచ్చారు.
''శుక్రవారం రాత్రి 11:22 గంటలకు పెద్ద పేలుడు జరిగింది. మేం చాలా భయపడ్డాం. అసలేం జరిగిందో మాకు అర్థం కావడానికి 15-20 నిమిషాలు పట్టింది. పోలీస్ స్టేషన్‌లో ఏదో జరిగినట్లు మాకు అర్థమైంది' అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో స్థానికుడు తారిఖ్ అహ్మద్ అన్నారు.
'మేం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లేసరికి మొత్తం పొగ కమ్ముకుంది. మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ పేలుడులో మా స్నేహితులు, పొరుగువారు కూడా చనిపోయారు' అని ఆయన ఏఎన్‌ఐతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫరీదాబాద్ పేలుడు పదార్థాల నమూనాలు సేకరిస్తుండగా...
నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో సంభవించిన పేలుడు గురించి జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వివరించారు.
"నౌగామ్ పోలీస్ స్టేషన్‌లోని ఎఫ్‌ఐఆర్ 162/2025 కేసు దర్యాప్తులో భాగంగా నవంబర్ 9, 10 తేదీల్లో ఫరీదాబాద్ నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, రసాయనాలు, రీజెంట్స్ స్వాధీనం చేసుకున్నాం. రికవరీ చేసుకున్న వాటన్నింటినీ స్టేషన్ ఆవరణలో, సురక్షిత ప్రదేశంలో జాగ్రత్తగా భద్రపరిచాం.
నిబంధనల ప్రకారం, మేం స్వాధీనం చేసుకున్న వాటి నమూనాలను తదుపరి ఫోరెన్సిక్, రసాయన పరీక్షల కోసం పంపించాల్సి ఉంటుంది. స్వాధీనం చేసుకున్న పదార్థాలు భారీ స్థాయిలో ఉండటం వల్ల ఫోరెన్సిక్ బృందం గత రెండు రోజులుగా ఈ నమూనాలను తీసుకుంటోంది. అత్యంత జాగ్రత్తగా వీటి నమూనాలను సేకరిస్తున్నారు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
"అయితే, ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ నిన్న రాత్రి 11:20 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ పేలుడు జరిగింది. దీనికి వేరే ఇతర కారణాలను ఊహించుకోవడం అనవసరం.
ఈ ఘటనలో ఎస్‌ఐఏ సిబ్బంది ఒకరు, ముగ్గురు ఫోరెన్సిక్ బృంద సభ్యులు, ఇద్దరు క్రైమ్ సీన్ ఫోటోగ్రాఫర్లు, మేజిస్ట్రేట్ బృందంలో భాగమైన రెవెన్యూ అధికారులు ఇద్దరు, ఈ బృందంతో సంబంధం ఉన్న ఒక టైలర్ మరణించారు. 27 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు సహా మొత్తం 32 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ భవనం తీవ్రంగా దెబ్బతింది. చుట్టుపక్కల భవనాలు కూడా ప్రభావితం అయ్యాయి. నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది" అని ఆయన వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














